Editorials

పీవీ నిజజీవిత విలువలు – ఇన్నయ్య ముచ్చట్లు

Narisetti Innaih Recalls His Memories With PV Narasimha Rao

పి.వి.నరసింహారావుతో యించుమించు 50 ఏళ్ళ పరిచయం, సన్నిహితత్వం వలన కొంతవరకు ఆయన్ను అవగాహన చేసుకున్నాననే చెప్పాలి.

ఆయన తెలంగాణాలో పుట్టినా, మరాఠాతో సన్నిహితత్వం పెంచుకున్నా, ఆంధ్రప్రదేశ్ ను వెనకేసుకొచ్చారు. రాష్ట్ర విద్యామంత్రిగా వుండగా నేను పి.వి.ని ఇంటర్వ్యూ చేశాను. కొల్లూరి కోటేశ్వరరావు నడిపిన “తెలుగు విద్యార్థి” మాసపత్రిక నిమిత్తం చేసిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు సవివరంగా వెల్లడించారు.

గోరాశాస్త్రి తెలుగు స్వతంత్ర ఎడిటర్ గా మానేసి ఆంధ్రభూమి సంపాదకుడుగా వున్నప్పుడు, ఆయనకు ఆర్థిక సహాయం చేసే నిమిత్తం, కర్నూలులో సన్మానం తలపెట్టాం. నాడు కోట్ల విజయభాస్కర రెడ్డి కర్నూలు పరిషత్ ఛైర్మన్ గా వుంటూ సన్మానానికి అధ్యక్షత వహించారు. పి.వి. అందులో ప్రధానోపన్యాసకుడు. అప్పుడు సన్నిహితంగా కలిశాం. 50 సంవత్సరాల సంచిక వేయగా కర్నూలులో పి.వి. ఆవిష్కరించి మాట్లాడారు. ఆ తరువాత హైదరాబాద్ లో అప్పుడప్పుడూ గోరాశాస్త్రి, నేను కలసి పి.వి.బంగ్లాకు వెళ్ళి సహాయం అడగడం, ఆయన ఎంతో కొంత గోరాశాస్త్రికి యివ్వడం ఆనవాయితీ.

పి.వి.ని చాలాసార్లు కలవడానికి నాకు అవకాశం కలిగింది. ఆదర్శనగర్ లో ఆయన వుండేవారు.అక్కడే నేనూ వున్నాను. అందువలన ఎలాంటి అప్పాయింట్ మెంట్ లేకుండా ఇంటికి వెళ్ళి చనువుగా మాట్లాడే అవకాశం లభించింది. పత్రికా విలేఖరిగా నేను ఎప్పుడైనా రాకుంటే ఇన్నయ్య యింకా రాయిస్టుగానే వున్నాడా అని పాలడుగు వెంకటరావు (ఎం.ఎల్.ఎ.) ను ఆరాతీసేవారు.

తేళ్ళ లక్ష్మీకాంతమ్మతో కలసి కొన్నిసార్లు పి.వి.ని. కలిశాను. ఆమె చాలా చనువుగా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయేవాడిని. ఉత్తరోత్తరా వారికి సన్నిహిత సంబంధం వున్నదని అది బెడిసికొట్టినప్పుడు, ఒకరిపై ఒకరు నవలా రూపంలో విమర్శలు చేసుకున్నారని లోకానికి తెలిసింది.

ఆంధ్ర ఉద్యమం, తెలంగాణా ఉద్యమం జరిగినా పి.వి. మాత్రం ఆంధ్రప్రదేశ్ కే నిలిచారు.

అసెంబ్లీలో రేబాల దశరథ్ రాంరెడ్డి స్పీకర్ గా వున్నప్పుడు వారి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా పి.వి. వున్నారు.
ఇందిరాగాంధి దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే, పి.వి.ఆమె అండనే నిలిచారు.

కేంద్రానికి వెళ్ళిన పి.వి.తన చాకచక్యంతో, యుక్తితో ఇందిరా గాంధీకి సన్నిహితంగా, అనేక పదవులు నిర్వహించారు.

విదేశీ పర్యటనలు చేసినప్పుడు ఆంధ్ర నుండి కొందరు జర్నలిస్టులను – వెంట తీసుకెళ్ళారు. అందులో పొత్తూరి వెంకటేశ్వరరావు, రామచంద్రమూర్తి, కళ్యాణి వంటి వారున్నారు. యు.ఎన్.ఐ.లో పనిచేసిన కళ్యాణిని వెంటబెట్టుకొని తిరుపతి వెళ్ళి కళ్యాణం వద్ద ఆమెను కూర్చోబెట్టుకున్నారు.

ఏ పదవిలో వున్నా తన సామర్థ్యాన్ని చూపిన పి.వి.కి కేంద్రంలో ఆర్థిక మంత్రి సింగ్ బాగా తోడ్పడి మంచి పేరు తెచ్చారు.

విదేశీపర్యటనలో అమెరికా వెళ్ళినప్పుడు, ఉభయసభల పార్లమెంటులో మాట్లాడితే తెల్లారి ఒక్క పత్రిక కూడా రిపోర్టు చెయ్యలేదు. ఉపన్యాసం బాగాలేక కాదు, భారతదేశానికి అప్పుడు విలువ యివ్వలేదు.

ఏ పదవిలో వున్నా పి.వి. సాహితీప్రియత్వాన్ని వదలలేదు. మరాఠి తెలుగు అనువాదాలు, తెలుగు హిందీ అనువాదాలు చేశారు. అందులో విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు హిందీలోకి అనువదించారు. హైదరాబాద్ ఆలిండియా రేడియోలో పనిచేసిన రామమూర్తి రేణు యీ విషయంలో పి.వి.కి గోస్ట్ రచయితగా తోడ్పడ్డారు. నేను అడిగితే, ప్రూఫ్ లు చూసిపెడుతున్నననేవారు!

కాళోజీ నారాయణరావు విప్లవ కవులను సమర్థిస్తూ వామపక్షాల వైపు నిలచిన కవి. అయితే ఆయన చిన్నప్పటి నుండీ పి.వి.కి సన్నిహిత మిత్రులు. అందువలన చనువుగా ఆయనకు పద్మవిభూషణ్ యివ్వజూపగా, కాళోజీ వద్దన్నారు. వరంగల్లులో వున్న కాళోజీకి నాడు ఫోను లేదు. కలెక్టర్ ను పంపించి ఆయన్ను ఫోనువద్దకు బలవంతంగా రప్పించి, పి.వి.బ్రతిమలాడి పద్మవిభూషణ్ స్వీకారానికి ఒప్పించారు. నేను, గోగినేని బాబు, వాళ్ళ యింట్లో భోజనం చేస్తూ కాళోజీని అడగగా ఆయన చెప్పిన సంగతి అది.

ఢిల్లీలో వుండగా అబ్బూరి ఛాయాదేవితో పి.వి. సన్నిహితంగా వుండేది. తరువాత ఆమే హైదరాబాద్ వచ్చేసింది.
ఏమండీ, ఢిల్లీలో లైబ్రేరియన్ ఉద్యోగం వదులుకొని వచ్చారు అని అడిగితే, ఆమె చెప్పింది – మగవారు స్త్రీలను ప్రేమగా చూసినా, పెరగనివ్వరు. జపాన్ వారు బోన్షాయ్ చెట్లను అలాగే పెంచుతారు. పెరగకుండా అందంగా వుండేట్లు చూడడం వారి కళ! అది ఆమె సమాధానం.

పి.వి. సమర్థుడు. వక్త, రచయిత, అనువాదకుడు. పరిపాలనలో రాటుదేలినవాడు. ఆంధ్రప్రదేశ్ ను అభిమానించినవాడు. అలాంటివాడు ప్రధానిగా చనిపోతే, కాంగ్రెస్ పార్టీ ఆయన్ను అగౌరవపరచిందని అభియోగం వున్నది.

పి.వి. రచనలు, అనువాదాలు పునర్ముద్రిస్తే ఆయన్ను గౌరవించినట్లు.

– నరిసెట్టి ఇన్నయ్య