Health

మీ దేహాన్ని పూర్తిగా మింగేసే కరోనా

మీ దేహాన్ని పూర్తిగా మింగేసే కరోనా

కరోనా అనేది గొంతునూ, ఊపిరితిత్తులనూ ప్రభావితం చేస్తుందని అందరికీ తెలుసు. కొందరిలో గుండెను మాత్రమే ప్రభావితం చేస్తుందన్న విషయం కొందరికే తెలుసు. కానీ… నిజానికి కరోనా వైరస్‌ తల భాగం మొదలుకుని కాళ్ల వరకు అనేక అవయవాలపై తన ప్రభావం చూపుతుంది. అలాగే తలవెంట్రుకల నుంచి కాలివేళ్ల వరకు అనేక అంశాలు సైతం అది సోకే తీరుతెన్నుల్లో వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. అయితే ఇవన్నీ తెలుసుకోవడం భయపడేందుకు కాదు. తెలుసుకొని ఆందోళనపడాల్సిన అవసరమూ లేదు. దేహం పైభాగం మొదలుకొని కిందివరకు ఎలా ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. అందుకే జుట్టు మొదలుకొని… కాలి గోటి వరకు అదెలా ప్రభావం చూపుతుందనే అంశాలను తెలుసుకుందాం. అవగాహన పెంచుకుందాం. ఆందోళనను దూరం చేసుకుందాం.

మెదడు
కరోనా కారణంగా కొందరిలో పక్షవాతం రావడాన్ని వైద్యనిపుణులు గుర్తించారు. అయితే ఈ లక్షణం చాలా చాలా అరుదుగా మాత్రమే కనిపించింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ ఉన్నవారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల క్లాట్స్‌ ఏర్పడి.. ఇలా జరగడం కనిపించింది. అలాగే కొందరిలో రక్తంలో ఆక్సిజన్‌ తగ్గడం వల్ల మెదడుకు సరైన మోతాదులో ఆక్సిజన్‌ అందక మెదడు గాయపడటం కూడా జరిగింది.

నాలుక – ముక్కు
కోవిడ్‌–19 సోకిన రోగుల్లో వాసనలూ, రుచి తెలియకపోవడం అన్నది ఒక ప్రధానమైన లక్షణం అన్నది ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ లక్షణం తగ్గిందంటే… మన వ్యాధి నుంచి క్రమంగా బయటపడుతున్నామన్నదానికి ఓ ప్రధాన సంకేతంగా పరిగణించవచ్చు.

ఊపిరితిత్తులు
కరోనా వైరస్‌ కారణంగా అత్యధికుల్లోనూ, అత్యధికంగానూ ఊపిరితిత్తులే ప్రభావితమవుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. లంగ్స్‌లో ఉండే ఏసీఈ–2 రిసెప్టార్స్‌ కారణంగా ఈ పరిణామం సంభవిస్తుంది. అలాగే నిమోనియా లాంటి పరిణామాలూ ఏర్పడుతుండటమూ తెలిసిందే. ఇక వైరస్‌ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తం కడ్డకట్టి క్లాట్స్‌ ఏర్పడి… రక్తప్రవాహంతోపాటు అవి ఊపిరితిత్తుల్లోకి కొట్టుకురావడం… దాని వల్ల గాలిమార్పిడి ప్రక్రియకు అవరోధం కలగడం మనందరికీ తెలిసిందే.

మూత్రపిండాలు
కోవిడ్‌–19 వ్యాధి కారణంగా కొందరిలో మూత్రపిండాలు దెబ్బతిని ‘అక్యూట్‌ కిడ్నీ డిసీజ్‌’కు దారితీయడాన్ని నిపుణులు గుర్తించారు. ఇక అకస్మాత్తుగా బ్లడ్‌ప్రెజర్‌ పడిపోవడం, ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోవడం వల్ల కూడా కిడ్నీలు ప్రభావితం కావడం కనిపించింది. రోగులకు వాడే రకరకాల మందులు సైతం కిడ్నీలపై దుష్ప్రభావం చూపడం కూడా కొంత కనిపించింది. ఇక చాలామంది కోవిడ్‌–19 రోగుల్లో మూత్రం ద్వారా ప్రోటీన్‌ పోవడాన్ని వైద్యనిపుణులు తరచూ గమనించడం జరుగుతోంది.

రక్తనాళాలు
కోవిడ్‌–19 సోకిన వారిలో రక్తనాళాలు చాలా ఎక్కువగా ప్రభావితం కావడాన్ని గుర్తించారు. గతంలో కోవిడ్‌–19ను ప్రధానంగా శ్వాసవ్యవస్థకు చెందిన వ్యాధిగా పరిగణించేవారు కదా. అయితే ఇటీవలి అధ్యయనాల తర్వాత దీన్ని శ్వాస వ్యవస్థకు చెందిన వ్యాధిగా కంటే… ప్రధానంగా రక్తనాళాలకు చెందిన వ్యాధిగానే ఎక్కువగా గుర్తిస్తున్నారు నిపుణులు. రక్తనాళల్లోని అంతర్గత పొర అయిన ‘ఎండోథీలియమ్‌’ ఎక్కువగా ప్రభావితమై దెబ్బతిన్నట్లుగా, రోగుల్లో మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఇలా రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తపు క్లాట్స్‌… ఏయే అవయవాలకు చేరితే… ఆయా అవయవాలు బాగా దెబ్బతిన్నట్లుగా కూడా నిపుణులు గమనించారు.

క్లోమగ్రంథి (పాంక్రియాస్‌)
కోవిడ్‌–19 సోకాక కొందరిలో ‘అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌’ కనిపించవచ్చు. కరోనా వల్ల వచ్చే అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌లో రక్తంలో షుగర్‌ అధికంగా ఉండటం, దాంతోపాటు లిపిడ్స్‌ అధికంగా ఉండటాన్ని నిపుణులు గుర్తించారు.

ఎండోక్రైన్‌ సిస్టమ్‌
కరోనా వైరస్‌ సోకిన కొందరిలో రక్తంలోని చక్కెర పాళ్లు అకస్మాత్తుగా పెరగడాన్ని చాలామంది రోగుల విషయంలో డాక్టర్లు గుర్తించారు. గతంలో డయాబెటిస్‌ లేని చాలామంది రోగుల్లోనూ ఈ పరిణామం సంభవించడాన్ని నిపుణులు చూశారు. అదేవిధంగా షుగర్‌ ఉన్న వారిలో కనిపించే ‘డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌’ అనే కాంప్లికేషన్‌ను కూడా కోవిడ్‌–19 రోగుల్లో గుర్తించారు.

కాలివేళ్ల చివరలు (కోవిడ్‌ టోస్‌)
కొంతమంది రోగుల్లో కాలివేళ్ల చివర్లలో మంట, తిమ్మిర్లు కనిపించాయి. అలాగే అవి ఊదా (పర్పులు) రంగులోకి మారడమూ నిపుణులు గుర్తించారు. ఇలా జరిగే పరిణామానికి ‘కోవిడ్‌ టోస్‌’గా పేరుపెట్టారు. కొందరిలో రక్తపు గడ్డలు కాలివేళ్ల చివరలకు చేరడం వల్ల అవి ఇన్‌ఫ్లమేషన్‌ (మంట, వాపు)లకు గురికావడం కూడా కనిపించింది.

జుట్టు
మీకో విషయం తెలుసా? కరోనా వైరస్‌ సోకుతున్న క్రమంలో అనేకానేక నిశితమైన పరిశీలనలను బట్టి చూస్తే… మామూలుగా తల నిండా ఒత్తుగా, పూర్తిగా జుట్టున్న వారితో పోలిస్తే బట్టతల (మేల్‌ బాల్డ్‌నెస్‌ పాటర్న్‌) ఉన్న వారిపై ఒకింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదే అంశాన్ని మరో రకంగా కూడా చెప్పవచ్చు. బట్టతల వచ్చే అవకాశం పురుషులకే ఎక్కువ కదా. ఇలా బట్టతల ఉన్న పురుషులకే కరోనా ఎక్కువగా సోకడాన్ని వైద్యనిపుణులూ, పరిశోధకులూ ‘గాబ్రిన్‌’ సైన్‌గా పరిగణిస్తున్నారు.

కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స చేస్తూ మరణించిన తొలినాటి డాక్టర్లలో ఒకరైన డాక్టర్‌ గాబ్రిన్‌ పేరు మీద ఈ అంశాన్ని ‘గాబ్రిన్‌ సైన్‌’గా చెబుతున్నారు. అలాగే కరోనా వైరస్‌ సోకాక విపరీతంగా మానసిక ఒత్తిడికి గురైన వారిలో సైతం జుట్టు విపరీతంగా రాలిపోవడం కూడా పరిశోధకులు గమనించారు. మామూలుగానే మానసిక ఒత్తిడికి జుట్టు రాలిపోవడం సహజం. దానికి తోడు ఈ కరోనా ఒత్తిడి మరింత అధికంగా కావడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మారుతోంది.

చర్మం
కరోనా ప్రభావంతో చర్మంపై ఎర్రటి దద్దుర్లు, ర్యాష్‌తో పాటు చిన్న పగుళ్లలాంటి గాయాలు, గుల్లలు, మచ్చలు, చర్మం ఎర్రబారడాలు ఇలా ఎన్నెన్నో రూపాల్లో కనిపిస్తాయి.

గుండె
కొన్నిసార్లు కోవిడ్‌–19 నేరుగా గుండెను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు… కొందరిలో గుండెపోటును పోలిన సిండ్రోమ్‌కు కారణమవుతుంది. అయితే యాంజియోగ్రామ్‌ చేస్తే మాత్రం గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ‘క్లాట్‌’ కనపడదు. ఇక మరికొందరిలో ‘టెంపరరీ బెలూనింగ్‌’ కారణంగా ‘బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌’ వంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు వైరస్‌ వల్లగానీ లేదా క్లోరోక్విన్‌ వంటి మందులు వాడటం వల్లగానీ గుండె స్పందనల లయ (రిథమ్‌)లో తేడాలు రావచ్చు. ఇక కోవిడ్‌–19 సోకిన కొందరిలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం మనందరమూ చూసిందే.

జీర్ణవ్యవస్థలో
కోవిడ్‌–19 సోకిన వారిలో అందరిలోనూ కనిపించే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి సాధారణ లక్షణాలతోపాటు మరికొందరిలో నీళ్లవిరేచనాలు కావడం కూడా మామూలే. చాలామంది రోగులకు మలపరీక్ష నిర్వహించినప్పుడు వారు విసర్జించిన మలంలోనూ ‘కరోనా వైరస్‌’ (సార్స్‌ సీవోవీ–2) ఉన్నట్లు గుర్తించారు.

కాలేయం
కోవిడ్‌–19 సోకిన చాలామంది రోగుల్లో అనేక కాలేయ స్రావాలైన ఎంజైములు చాలా ఎక్కువ మొత్తంలో స్రవించిన దాఖలాలున్నాయి. అన్నట్టు… వైరస్‌ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కాలేయ స్రావాలూ పెరగడాన్ని కూడా గమనించారు. వైరస్‌ను చంపడానికి ఇచ్చే మందులతో కాలేయం కూడా ఎంతో కొంత ప్రభావితమయ్యే అవకాశాలూ ఉన్నాయి. అందుకే అప్పటికే కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగులకు కోవిడ్‌–19 సోకినట్లయితే… వారు మెరుగుపడే అవకాశాలు మామూలు వారికంటే కాస్తంత ఆలస్యం కావడం నిపుణులు గుర్తించారు. ఇక వైరస్‌ కారణంగా దేహంలోని గాల్‌బ్లాడర్‌ సైతం ప్రభావితం కావడాన్నీ గమనించారు.

మానసిక ప్రభావాలు
వైరస్‌ సోకిన రోగుల్లో మానసిక ఒత్తిడి పెరగడం, స్పష్టత లోపించడం, అయోమయానికి గురికావడం, మెదడుకు రక్తసరఫరా తగ్గడంతో పాటు అనేక రకాల మానసిక సమస్యలు ఎదురుకావడం చాలా స్పష్టంగా కనిపించింది.

ప్రత్యుత్పత్తి అవయవాలు
చాలామంది మహిళా రోగుల్లో వారి గర్భం నుంచి బిడ్డకు కోవిడ్‌–19 సోకిన దాఖలాలు చాలా స్పష్టంగా కనిపించాయి.

ఇలా మనకు తెలిసిన అవయవాలనే గాక ఇంకా అనేకానేక అవయవాలను ప్రభావితం చేయడం గురించి మనం ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇన్నిన్ని అవయవాలపై ఇన్ని రకాలుగా ప్రభావం చూపినప్పటికీ చాలా తక్కువ మందిలో మాత్రమే… అంటే దాదాపు 90 శాతం రోగుల్లో ఇది ప్రమాదకారి కానేకాదు. అయితే ఇటీవల కొందరు వ్యాధి కంటే అనవసరమైన ఆందోళనలతోనే ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఇన్ని అవయవాలను అది ప్రభావితం చేసినా… అసలు వ్యాధి కంటే ఆందోళనే ఎక్కువగా ప్రమాదకారి అవుతోందని గుర్తిస్తే… దాని నుంచి ముప్పే ఉండదన్న విషయం మనందరికీ స్పష్టమవుతోంది. అనేక అధ్యయనాల్లోనూ ఇది తేలింది. అందుకే విషయం తెలుసుకోండి. నిర్భయంగా ఉండండి.